రాష్ట్రంలో క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేసి, క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తెలిపారు. జూలై 12న దువ్వాడలోని అన్నమయ్య ఇండోర్ హాల్‌లో నిర్వహించనున్న 2వ రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్–2026 పోటీల ట్రోఫీని మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి పోటీలను తన నియోజకవర్గ పరిధిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు నిజమైన క్రీడా స్ఫూర్తితో రాణించాలని ఆకాంక్షించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నాయని గుర్తుచేసారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు తమ వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కరాటే అసోసియేషన్ నిర్వహించే టోర్నీలకు ప్రముఖ ఫార్మా సంస్థలు, పారిశ్రామిక సంస్థల నుంచి స్పాన్సర్‌షిప్‌లు, ఆర్థిక సహకారం అందేలా వ్యక్తిగతంగా ప్రత్యేక చొరవ తీసుకుంటానని వెల్లడించారు.ఈ టోర్నమెంట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను స్వయంగా హాజరవుతానని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, నిర్వాహకులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కె. శివ గణేష్, జనసేన పార్టీ 88వ వార్డు అధ్యక్షుడు జనార్దన శ్రీకాంత్, మార్కెటింగ్ డైరెక్టర్ గల్లా శ్రీనివాసరావు, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఎస్. శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ. వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకులను ఇంటర్నేషనల్ ఒకినావన్ షోరిన్ ర్యు సెబు కాన్ కరాటే డో ఇండియా చీఫ్ & టెక్నికల్ డైరెక్టర్ పి.ఆర్. రత్నపాల, వడో కాయ్ కరాటే డో అసోసియేషన్ ఇండియా చీఫ్ సి.హెచ్. సతీష్ కుమార్, రియాన్ షూటో కాన్ కరాటే డో ఇండియా ప్రెసిడెంట్ ఎస్. నూకరాజు అభినందించారు.
