చీడికాడ, జూన్ 16(క్విక్ న్యూస్): విద్య ద్వారానే వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని, విద్యార్థులు మధ్యలో చదువు ఆపేయకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తా శ్రీనివాసరావు అన్నారు.

చీడికాడ మండలం జి.కొత్తపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి నిర్వహించిన గో టు 40 డేస్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విద్యపై చైతన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు మూడు దశాబ్దాల పాటు జరిగిన పోరాటాన్ని గుర్తుచేసిన ఆయన, వర్గీకరణ సాధించిన అనంతరం ఇప్పుడు సమాజ భవిష్యత్తు కోసం పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాలకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకుని మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సులు, పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన కంటిపాము హాసిని (531 మార్కులు), చేవేటి అభిషేక్ (409 మార్కులు) లను అభినందించి, భవిష్యత్తులో ఉన్నత చదువులు అభ్యసించాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, మాదిగ మహిళా సంఘం నాయకులు, మాజీ సర్పంచ్ కంటిపాము అచ్చియమ్మ, కంటిపాము ప్రకాష్, గోరంట్ల మాణిక్యం, రావాడ దేవుడుబాబు, కంటిపాము నూకరత్నం, వేపచేడు ఈశ్వరమ్మ, కంటిపాము రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.