
దేవరాపల్లి, జూన్ 17(క్విక్ న్యూస్): దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు తాము చదువుకున్న విద్యాలయానికి అపూర్వ కానుక అందించారు. దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థులైన ఆర్మీ జవాన్లు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన సరస్వతి దేవి ఆలయం, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.

అర్చకుడు అఖిల్ శర్మ వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, ఎంఈఓ-1 ఈశ్వరరావు, ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్ ఉమా, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాధ ఆలయ నిర్మాణానికి సహకరించిన పూర్వ విద్యార్థులను అభినందించారు.

విద్యాలయ ప్రాంగణంలో జ్ఞానస్వరూపిణి సరస్వతి దేవి ఆలయం ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లో విద్యాభక్తి, క్రమశిక్షణ, సాంస్కృతిక విలువలు మరింత పెంపొందుతాయని వారు పేర్కొన్నారు. మాతృ విద్యాలయంపై ఉన్న అభిమానంతో 20 మంది ఆర్మీ పూర్వ విద్యార్థులు స్వచ్ఛందంగా నిధులు సమీకరించి ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం ప్రశంసనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన ఆర్మీ జవాన్లు కొల్లి సింహాద్రి, సత్యవరపు ఆనంద్, గుల్లిపల్లి అప్పలనాయుడు, కోరుపోలు దేముడునాయుడు, కొల్లి శ్రీను, గుల్లిపల్లి చంద్రరావుతో పాటు ఇతర జవాన్లు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.