కరాటే కేవలం ఆత్మరక్షణ కళ మాత్రమే కాదని, అది క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వానికి ప్రతీక అని విజిలెన్స్ విభాగం ఓఎస్డీ కింజరపు ప్రభాకర్ అన్నారు. బుధవారం ఎంవీపీ కాలనీలో నిర్వహించిన 2వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్–2026 పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కరాటే ఇన్‌స్ట్రక్టర్లు, విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నిరంతర సాధనతో ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొని దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. భారత జెండాను అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కరాటే విద్య ద్వారా శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు విద్యలోనూ రాణించి ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్-1 వంటి ఉన్నత సేవల్లో స్థానం సంపాదించి ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఇంటర్నేషనల్ ఒకినావన్ షోరిన్ ర్యూ సెబుకాన్ ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్–2026 పోటీలు జూలై 12న దువ్వాడ రోడ్డులోని అన్నమయ్య వేదిక ఇండోర్ హాల్‌లో జరగనున్నట్లు నిర్వాహకులు శివ గణేష్, శ్రీను తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది క్రీడాకారులు పాల్గొనే అవకాశముందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు, చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ కె. శివ గణేష్ టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఎస్. శ్రీను, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జె. గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ వి. నాగరాజు పాల్గొన్నారు. అలాగే ఇండియా చీఫ్ & టెక్నికల్ డైరెక్టర్ పీ.ఆర్. రత్నపాల, వడోకాయ్ ఇండియా చీఫ్ సీహెచ్. సతీష్ కుమార్, రియాన్ షూటోకాన్ కరాటే డో ఇండియా అధ్యక్షుడు ఎస్. నూకరాజు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.