చేపల పునరుత్పత్తి, మత్స్య సంపద సంరక్షణ లక్ష్యంగా దేవరాపల్లి మండలంలోని రైవాడ జలాశయంలో రెండునెలల పాటు చేపల వేటపై నిషేధం అమలు చేస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. జిల్లా మత్స్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం రైవాడలో చేపల వేటదారులతో నిర్వహించిన సమావేశంలో ఫిషరీస్ అసిస్టెంట్ అప్పలనారాయణ ఈ విషయాన్ని తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు జలాశయంలో చేపల వేట పూర్తిగా నిషేధించబడుతుందని చెప్పారు. ఈ కాలంలో చేపలు గుడ్లు పెట్టి సహజసిద్ధంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పించడమే నిషేధం ఉద్దేశమని వివరించారు. నిషేధ కాలంలో రైవాడ జలాశయ పరిధిలోని వేటదారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి వేట సాగించిన వారిపై చట్టపరమైన చర్యలతో పాటు లైసెన్సులు రద్దు చేసి జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు. మత్స్య సంపద పరిరక్షణలో భాగంగా వేటదారులందరూ ప్రభుత్వ నిబంధనలను పాటించి సహకరించాలని కోరారు.అయితే, వేట నిషేధం అమల్లో ఉన్న రెండునెలల కాలానికి ప్రభుత్వం నుంచి జీవన భృతి అందించాలని సమావేశంలో వేట దారులు అధికారులను కోరారు.