ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించేందుకు దేవరాపల్లి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(PACS)లకు అవసరమైన నిల్వలను ప్రభుత్వం సమకూర్చిందని మండల వ్యవసాయ అధికారిణి ఎల్.వై. కాంతమ్మ తెలిపారు. మంగళవారం కలిగొట్ల పీఏసీఎస్‌లో ఎరువుల పంపిణీ ప్రక్రియను ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెరకు సాగు చేస్తున్న రైతులకు తొలి ప్రాధాన్యంలో ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కలిగొట్ల పీఏసీఎస్‌కు 24 మెట్రిక్ టన్నుల యూరియా, 10 మెట్రిక్ టన్నుల డీఏపీ, ములకలాపల్లి పీఏసీఎస్‌కు 24 మెట్రిక్ టన్నుల యూరియా, ఎం.అలమండ పీఏసీఎస్‌కు 24 మెట్రిక్ టన్నుల యూరియా, 10 మెట్రిక్ టన్నుల డీఏపీ చేరినట్లు వెల్లడించారు. ఈ వారంలో ఆయా సంఘాల పరిధిలోని రైతులకు ఎరువులు పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు.రైతులు ఎరువులు తీసుకునే ముందు గ్రామ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి భూమి, పంట వివరాలు ఈ-క్రాప్‌లో సక్రమంగా నమోదయ్యాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. వివరాల్లో మార్పులు ఉంటే ముందుగా సరిచేసుకుని అనంతరం పీఏసీఎస్‌కు వెళ్లి ఎరువులు పొందాలని కోరారు.