qwiknews.in | Qwik News Telugu – Breaking News from Andhra Pradesh, Visakhapatnam & Anakapalliరైతుల భూములకు శాశ్వత రక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే… › e-Paper Clip qwiknews.in | Qwik News Telugu – Breaking News from Andhra Pradesh, Visakhapatnam & Anakapalli
Share: f 𝕏 in @ 📱 WhatsApp
qwiknews.in 18 Sep 2026, 1:48 pm
Date of Publish : 09 Jul 2026, 3:44 pm  |  Posted by : VARAHALABABU
👁 236 💬 0
Latest News

రైతుల భూములకు శాశ్వత రక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బండారు

రైతుల భూములకు శాశ్వత రక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బండారు

రైతులు తమ తాతముత్తాతల నుంచి సంక్రమించిన భూములకు స్పష్టమైన హద్దులు లేక, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడే పరిస్థితికి స్వస్తి పలికేందుకే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యన్నారాయణ మూర్తి స్పష్టం చేశారు. దేవరాపల్లి మండలంలోని తెనుగుపూడి గ్రామంలో గురువారం నిర్వహించిన మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో ఎమ్మెల్యే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తప్పుడు విధానాలతో రైతాంగాన్ని తీవ్ర గందరగోళానికి గురిచేసిందని మండిపడ్డారు. రైతుల సొంత భూములపై అప్పటి ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత తప్పులను సరిదిద్ది, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చట్టబద్ధమైన రాజముద్రతో, శాశ్వత హక్కు పత్రాలను రైతులకు అందిస్తోందన్నారు. తెనుగుపూడిలో తహశీల్దార్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు శాటిలైట్ సాంకేతికతతో పక్కాగా సర్వే నిర్వహించి, అన్నదమ్ముల మధ్య భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ ఇబ్బందులు రాకుండా ప్రతి సెంట్ భూమికి ఖచ్చితమైన సరిహద్దులను నిర్ధారించామని పేర్కొన్నారు.​ దేవరాపల్లి మండల పరిధిలో ఇంకా మిగిలి ఉన్న 10 రెవెన్యూ గ్రామాలలో ఎటువంటి తొందరపాటు లేకుండా, నెలకు ఒక గ్రామం చొప్పున పారదర్శకంగా భూ సర్వే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. వచ్చే 2027 మే నాటికి దేవరాపల్లి మండలంలోని ప్రతి చిన్న భూకమతానికి, స్పష్టమైన హద్దులతో కూడిన శాశ్వత పట్టాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. గతంలో స్థానిక సర్పంచుల నుంచి ఆశించిన సహకారం లభించకపోవడం వల్లే తెనుగుపూడి గ్రామంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని ఎమ్మెల్యే బండారు పేర్కొన్నారు. ప్రస్తుతం పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నందున.. త్వరలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్న ‘పల్లె పండుగ-3’ నిధుల మంజూరు లో తెనుగుపూడికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని, గ్రామాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.