తండ్రి, తాతయ్యల జ్ఞాపకార్థం ‘ఎల్‌జీవీఎన్’ ట్రస్ట్
ప్రజలకు నిస్వార్థమైన సేవలు అందించడమే లక్ష్యంగా ‘లక్ష్మీ గణపతి వెంకట నాయుడు చారిటబుల్ ట్రస్ట్ (ఎల్.జి.వి.ఎన్)’ ఆవిర్భావం జరిగింది. సమాజ సేవలో తనవంతు పాత్ర పోషించాలనే సంకల్పంతో తండ్రి, తాతయ్యల జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేలా ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, చైర్మన్ అవుగడ్డ సత్యవేణి (నాయుడమ్మ) తెలిపారు.మారేపల్లిలో ఏర్పాటు చేసిన లక్ష్మీ గణపతి వెంకట నాయుడు చారిటబుల్ ట్రస్ట్ ను గురువారం సాయంత్రం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ట్రస్ట్ ఆవిర్భావం సందర్భంగా అవుగడ్డ సత్యవేణి మాట్లాడుతూ.. తన తాతయ్య అవుగడ్డ నాయుడుబాబు, తండ్రి అవుగడ్డ వెంకట త్రినాధ్ నాయుడు జ్ఞాపకార్థం ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడమే ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమన్నారు.ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడం, అవసరమైన సందర్భాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం, సమాజానికి తనవంతు సహకారం అందించడం వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా ప్రజా సేవకు ప్రాధాన్యం ఇవ్వాలన్నదే లక్ష్యంగా ‘ఎల్.జి.వి.ఎన్’ ట్రస్ట్‌ను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.... రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న అవుగడ్డ సత్యవేణి (నాయుడమ్మ) సేవా కార్యక్రమాలపై దృష్టి సారించడం అభినందనీయమన్నారు. లక్ష్మీ గణపతి వెంకట నాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.తండ్రి, తాతయ్యల పేర్లను నిలబెట్టేలా నాయుడమ్మ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామమన్నారు. వారి జ్ఞాపకాలను కేవలం పేర్లకే పరిమితం చేయకుండా, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా వారిని స్మరించుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు.ప్రజల కోసం ట్రస్ట్ ద్వారా చేపట్టే సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అవుగడ్డ సత్యవేణి ఎమ్మెల్యే ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చొక్కాకుల వెంకట్రావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దాడ వెంకటరమణ, రైవాడ జలాశయం చైర్మన్ పోతల పాత్రునాయుడు, గొర్లె రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.