ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను మరో రెండు రోజుల్లో 95 శాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ బీఎల్‌వోలను ఆదేశించారు. దేవరాపల్లి తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్‌తో కలిసి మండలంలోని 57 పోలింగ్ కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న బీఎల్‌వోల పనితీరును సమీక్షించారు.ఇంటింటి సర్వే పురోగతి, ఇప్పటివరకు సేకరించిన వివరాలను పరిశీలించిన కలెక్టర్, అర్హులైన ప్రతి ఓటరు వివరాలను నిబంధనల మేరకు నమోదు చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు సంబంధించిన ఆధార్, ఫొటోలు తదితర వివరాలను సత్వరమే సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అవసరమైతే అంగన్‌వాడీ, వెలుగు, ఉపాధి హామీ సిబ్బంది సహకారాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సర్ ప్రక్రియలో నిర్లక్ష్యానికి తావులేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్ల నుంచి ఫిర్యాదులు వస్తే సంబంధిత బీఎల్‌వోలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల కేంద్ర పరిధిలోని కొందరు బీఎల్‌వోల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, అప్పగించిన లక్ష్యాలను 48 గంటల్లోగా పూర్తిచేయని వారిపై సస్పెన్షన్ సహా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే 80 శాతానికి పైగా లక్ష్యాలను పూర్తిచేసిన బీఎల్‌వోలను అభినందించారు.సమావేశంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎస్.డి. అనిత, తహశీల్దార్ పి. లక్ష్మీదేవి, ఎంపీడీవో కె. వరప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్ కె. అప్పారావు, సర్ సూపర్వైజర్లు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.
