చీడికాడ మండలకేంద్రంలోని అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మాదిగ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి మోర్తా శ్రీనివాసరావు ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నుంచి దళితుల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం నిరంతర ఉద్యమాలు సాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ల పెంపు వంటి పలు సంక్షేమ చర్యల సాధనలో ఎమ్మార్పీఎస్ ఉద్యమాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో పోరాటాలు నిర్వహించామని, దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కూడా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కడితి దేవుడమ్మ, ఐన్నీల్లి కొండమ్మ, వేపచెడు అర్జునమ్మ, రావాడ దేవుడమ్మ, రావాడ అప్పారావు, కడితి కేశమ్మ, రావాడ దేవుడుబాబు, మహాజన సోషలిస్ట్ పార్టీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి చెవేటి వెంకటరావు, బన్నవోలు చినరాజు తదితరులు పాల్గొన్నారు.
