జీఓ-396 ఉపసంహరించాలి.. దస్తావేజు లేఖర్ల డిమాండ్

VarahalaBabu
1 Min Read

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నం.396 ప్రకారం పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కేలు) ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించి, జీఓను తక్షణమే ఉపసంహరించుకోవాలని పెందుర్తి దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు పెందుర్తి జాయింట్ సబ్‌రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌కేల్లో పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) విధానాన్ని అమలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది దస్తావేజు లేఖర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో దస్తావేజుపై ఫెసిలిటేషన్ ఛార్జీలతో పాటు పీడీఈ సేవల రుసుములు వసూలు చేయడం వల్ల సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు.రిజిస్ట్రేషన్ చట్టాలు, స్టాంప్ డ్యూటీ, కుటుంబ చట్టాలపై తగిన అవగాహన లేని ఆపరేటర్ల ద్వారా దస్తావేజులు సిద్ధమైతే భవిష్యత్తులో న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశముందని వివరించారు. జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఆర్‌ఎస్‌కేలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు సమయం, ధనం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.దశాబ్దాలుగా ప్రభుత్వ ఆదాయ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దస్తావేజు లేఖర్ల అనుభవాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్‌ఎస్‌కేల్లో పీడీఈ విధానంతో పాటు దస్తావేజు లేఖర్ల సేవలను కొనసాగించాలని, దస్తావేజుల తయారీలో ప్రజలకు ఎంపిక అవకాశం కల్పించాలని, లేఖర్లను ప్యానెల్‌గా నియమించాలని, ఫెసిలిటేషన్ ఛార్జీలను పునఃసమీక్షించాలని, జీఓ-396ను వెంటనే రద్దు చేసి వారి జీవనోపాధిని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article