జూన్ 17న గోవాడ సుగర్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా

బకాయిల భారంతో రైతు.. పరిష్కారం కోసం పోరుబాట

VarahalaBabu
2 Min Read

గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులకు చెల్లించాల్సిన రూ.29 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఫ్యాక్టరీలో క్రషింగ్ కార్యకలాపాలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జూన్ 17న ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించనున్న చెరుకు రైతుల ధర్నాను విజయవంతం చేయాలని రైతు కూలీ సంఘం (ఏపీ)-ఏఐఎఫ్టీయూ న్యూ పిలుపునిచ్చింది. ఈ మేరకు చౌడువాడ పాల కేంద్రం వద్ద ఆదివారం ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్‌రావు మాట్లాడుతూ, 2024-25 సీజన్‌కు సంబంధించిన చెరుకు బిల్లులు ఇప్పటికీ రైతులకు అందకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి సాగు చేసిన రైతులు బకాయిల కోసం ఎదురుచూస్తుండగా, మరోవైపు ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలిచిపోవడంతో వేలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధి సంక్షోభంలో పడిందన్నారు.
ఫ్యాక్టరీ మూత ప్రభావం కేవలం రైతులకే పరిమితం కాకుండా, చోడవరం, మాడుగుల ప్రాంతాల ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. స్థానిక వ్యాపారాలు, గ్రామ పంచాయతీల ఆదాయ వనరులు గణనీయంగా తగ్గిపోయాయని చెప్పారు. గ్రామీణాభివృద్ధికి కీలకమైన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నిర్వీర్యం చేయడం సరికాదని, ఫ్యాక్టరీ భవిష్యత్తుపై సభ్య రైతులతో కలిసి మహాజన సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పీపీపీ విధానంలో ఫ్యాక్టరీని ప్రైవేటు చేతుల్లోకి అప్పగించే ప్రతిపాదనలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. రైతులు, కార్మికుల బకాయిల చెల్లింపు, ఫ్యాక్టరీ ఆధునికీకరణ, క్రషింగ్ పునఃప్రారంభం కోసం ఇప్పటికే అనేక ఉద్యమాలు నిర్వహించినప్పటికీ ఫలితం కనిపించలేదని విమర్శించారు. జనవరిలో 23 రోజుల పాటు జరిగిన నిరసన దీక్షల సందర్భంగా ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని గుర్తు చేస్తూ, రైతుల సమస్యల పరిష్కారం కోసం జరిగే ధర్నాలో సభ్య రైతులంతా పెద్దఎత్తున పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌వైఎస్ జిల్లా కన్వీనర్ నందారపు భాస్కరరావు, పాల సంఘం అధ్యక్షుడు కొమార వెంకటరమణ, రైతులు కొమార కోటేశ్వరరావు, ధరిమిశెట్టి అప్పారావు, కొమార నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Img wa0024
📄 Generate e-Paper Clip
Share This Article
270 Comments