శ్రావణమాసం సందర్భంగా దేవరాపల్లి మండలం ఎం.అలమండ గ్రామంలో వరలక్ష్మీదేవి వ్రత వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పోతల నాయుడు, కృష్ణవేణి దంపతులు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ నిర్వహించిన అనంతరం షోడశోపచారాలతో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి తోరాలు కట్టుకుని వ్రతకథను శ్రద్ధగా శ్రవణం చేశారు. వ్రత విశిష్టతను భక్తులకు వివరించిన అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామంలోని సుమారు 300 మంది మహిళలకు తాంబూలాలతో పాటు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వరలక్ష్మీ వ్రత వేడుకలతో ఎం.అలమండ గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు.
